ట్రంప్ సుంకాలు.. రొయ్య‌ల ఎగుమ‌తిదారుల‌కు రేటు ఫిక్స్ చేసిన చంద్రబాబు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది.

By అంజి
Published on : 8 April 2025 9:07 AM IST

CM Chandrababu, aqua sector, USA tariff effect, APnews

'రొయ్యల ధరలు తగ్గించవద్దు'.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అమరావతి: అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది. 100 కౌంట్‌ రొయ్య కిలోకు రూ.220 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అమెరికా సుంకాలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 11 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీరు అందిస్తామని తెలిపారు. రొయ్యల ఎగుమతిపై అమెరికా సుంకాల విధింపు వల్ల ఎదురవుతున్న కష్టాలపై సోమవారం రాత్రి ఆక్వా రైతులు, భాగస్వాములు, వ్యాపారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆక్వా రంగంలో ప్రత్యక్షంగా 3 లక్షల మంది, పరోక్షంగా 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. కాగా ఇప్పటికే పలు కారణాలతో కుదేలవుతున్న ఆక్వా రంగానికి కొంత సుంకాలు మరింత నష్టం తెచ్చేలా కనిపిస్తున్నాయి.

ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అంటూ సీఎం చంద్రబాబును వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ''అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే, ఆపేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌ అయి రైతులను దోచుకుతింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? రోజు రోజుకూ ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? ప్రభుత్వ స్థాయిలో ఒక రివ్యూ చేసి, గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? రైతులంతా గగ్గోలు పెడితే, మీడియా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలదీస్తే కేంద్రానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? 100 కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200- 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్‌ హాలిడే తప్ప వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?''అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

Next Story