సీఎం చంద్రబాబు మార్క్ క్లాస్..పనితీరు లేని అధికారులకు వేదికపైనే చురకలు!
అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన 'జలధార' సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా వ్యవహరించారు.
By - Knakam Karthik |
సీఎం చంద్రబాబు మార్క్ క్లాస్..పనితీరు లేని అధికారులకు వేదికపైనే చురకలు!
అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన 'జలధార' సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా వ్యవహరించారు. తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ శాఖల పనితీరు 'ప్రోగ్రెస్ రిపోర్ట్'ను ప్రజల ముందే చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని అధికారులను వేదికపైకి పిలిపించి నేరుగా వివరణ కోరారు. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ఈ ప్రయత్నమని స్పష్టం చేస్తూ, పనితీరును మెరుగుపరుచుకోవాలని అధికారులను హెచ్చరించారు. అదే సమయంలో బాగా పనిచేసిన అధికారులను ప్రజల చేత చప్పట్లు కొట్టించి అభినందించారు. ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా సూపర్ అచీవర్స్, అచీవర్స్, పెర్ఫార్మర్స్, లెర్నర్స్ గా వర్గీకరిస్తున్నట్లు వెల్లడించిన సీఎం, ఇకపై తాను హాజరయ్యే ప్రతి సభకు జిల్లా యంత్రాంగం మొత్తం రావాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై నేరుగా ప్రజల అభిప్రాయాన్ని కోరిన సీఎం, ఆదాయం తగ్గినా సరే ప్రజల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేవారిని ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూవివాదాలు లేకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజా సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు ఎలా విధ్వంసమయ్యాయో వివరిస్తూనే, ప్రభుత్వానికి సహకరించే అధికారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా అధికారులపై అనవసర ఫిర్యాదులు చేయకుండా వారి పనితీరు ఆధారంగానే బేరీజు వేయాలని, రాజకీయ పార్టీలను కూడా వారి పనితీరును బట్టే విశ్లేషించాలని ముఖ్యమంత్రి సూచించారు.