పెట్టుబడులకు ఏపీని మించింది లేదు : సీఎం చంద్రబాబు

ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు

By -  Knakam Karthik
Published on : 20 Jan 2026 4:00 PM IST

Andrapradesh, CM Chandrababu, World Economic Forum, Davos Tour

పెట్టుబడులకు ఏపీని మించిన గమ్యస్థానం మరొకటి లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు

ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం ప్రసంగించారు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంథనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్‌లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయం రంగంతో పాటు వైద్య రంగంలోను డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం చెప్పారు. 2026‌లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుంచి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 1,054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీ బలమని చెప్పారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోందన్నారు.

Next Story