2027 గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించి కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
By - Knakam Karthik |
2027 గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించి కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. పోలవరం నుంచి గోదావరి నీటిని నల్లమల సాగర్‌కు తరలిస్తామని, నల్లమల సాగర్ మరియు వెలిగొండ ప్రాజెక్టులను ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
దోర్నాల మండలం ఘంటవానిపల్లెలో రూ.456 కోట్ల విలువైన వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. జిల్లా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని, దీనివల్ల ప్రజలకు 150 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గిందని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి, కరువు పీడిత ప్రాంతాలకు కృష్ణా జలాలను అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గిద్దలూరు, మార్కాపురం, కనిగిరితో పాటు కడప జిల్లాలోని ఉదయగిరి, బద్వేల్ వంటి ప్రాంతాల్లోని 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం మొత్తం రూ.9,081 కోట్లు అవసరమని, ఇప్పటికే రూ.5,451 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మిగిలిన పనుల కోసం మరో రూ.2,540 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
నల్లమల సాగర్ ద్వారా ప్రతి ఇంటికి రూ.1,300 కోట్లతో సురక్షితమైన తాగునీరు అందిస్తామని, మార్కాపురంలో కొత్త జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను ఉద్యానవన పంటల కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి వైమానిక సర్వే ద్వారా పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.