అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.
By అంజి
అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అమరావతి: అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు. అల్లూరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి లేకపోతే సంపద రాదని, సంక్షేమం లేకపోతే మెరుగైన జీవన ప్రమాణాలు రావని చెప్పారు. ఆ రెండు తనకు కళ్ల వంటి వన్నారు. టూరిజానికి ప్రాధాన్యత ఇస్తూ, ఎంతైనా ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.
''గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. సంపద సృష్టించేందుకు అన్ని వసతులు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలని అనుకుంటున్నా. స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిచ్చాయి. మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం'' అని అన్నారు.
''నేను మీ మనిషిని.. గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత నాది.. ఆ బాధ్యత తీసుకుంటున్నా మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తా, గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన బిడ్డలకే, టీచర్ ఉద్యోగాలు వచ్చేలా పోరాడతా... మొట్టమొదటి సారిగా గిరిజన ప్రాంతాల్లో, గిరిజనులకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించక కోర్టులో జీవో కొట్టేసారు. మళ్ళీ నేను 2000వ సంవత్సరంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వటమే కాక, అందులో కూడా 33% ఆడబిడ్డలకు ఇస్తూ జీవో 3 ఇచ్చాను. 2020లో జగన్ అసమర్ధ పాలనలో, సరైన వాదనలు వినిపించలేక, సుప్రీం కోర్టులో ఈ జీవో కొట్టేసారు. 4 ఏళ్ళు జగన్ రెడ్డి కనీసం ఈ కేసు గురించి పట్టించుకోకుండా గిరిజనులకు అన్యాయం చేసాడు'' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.