అమరావతి: మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించి, నష్టం తీవ్రతను స్వయంగా అంచనా వేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ పరిస్థితులను సమీక్షిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు వద్ద ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది.
ఓడలరేవుకు చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. మొంథా తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. రైతులను పరామర్శించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.