ప్రజలు ఓట్లేస్తేనే మనం పవర్‌లో ఉన్నాం అది మరవొద్దు: సీఎం చంద్రబాబు

ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు

By Knakam Karthik
Published on : 1 Aug 2025 2:25 PM IST

Andrapradesh, Cm Chandrababu, Teleconference, Public Representatives, Party leaders

ప్రజలు ఓట్లేస్తేనే మనం పవర్‌లో ఉన్నాం అది మరవొద్దు: సీఎం చంద్రబాబు

గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమ అందిస్తున్నాం..అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించారు. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు. సీఎం మాట్లాడుతూ..చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నాం. లబ్దిదారుల సంఖ్య పెరిగింది.. ఆర్థిక చేయూతను పెంచాం. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అమలు చేయనున్నాం. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ యంత్రాంగమే. నిత్యం ప్రజల్లో ఉండాలి.. ప్రజల కోసం పని చేయాలి. ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలో ఉన్నామనే విషయాన్ని ఎప్పటికీ మరువొద్దు. గత ఎన్నికల్లో మనకు ఓటేసిన వారు నిత్యం మనతోనే ఉండాలి.. మరింత మంది మన పాలనను మెచ్చాలి..అని సీఎం వ్యాఖ్యానించారు.

రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించి మొదటి విడతగా రైతులకు రూ.7 వేలు జమచేస్తాం. ఇందులో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు ఉంటుంది. 46,85,838 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం రూ.2,342.92 కోట్లు విడుదల చేశాం. కేంద్రం రూ.831.51 ఇస్తోంది. అర్హులైన రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే 155251 టోల్ ఫ్రీ నంబర్‌కు చేసి ఫిర్యాదు చేయవచ్చు. రైతు సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ. మన జెండాలోనే నాగలి గుర్తు ఉంది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక రూ.50లకే విద్యుత్ అందించారు. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. ఇది మన పార్టీ సిద్ధాంతం. రాయలసీమలో 90 శాతం ప్రాజెక్టులు మన హయాంలో చేపట్టినవే. మనం చేపట్టిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసింది.. పథకాలను రద్దు చేసింది. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇచ్చింది. రైతులకు రూ.1,674 కోట్లు బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చాక చెల్లించాం. 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తున్నాం. అగ్రిటెక్ ద్వారా రైతులకు పరికరాలు అందజేస్తున్నాం. ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే 2 సార్లు నిండింది. హంద్రీనీవా ఫేజ్-1లో భాగంగా నీళ్లు విడుదల చేశాం. ఏడాదిలో రూ.3,890 కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా పనులు పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ రైతులకు మేలు చేకూర్చేవే. ప్రతి రైతులో మన ప్రభుత్వం ఉందనే భరోసాను కలిగించాలి...అని సీఎం మాట్లాడారు.

Next Story