సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By -  Medi Samrat
Published on : 28 Feb 2026 9:20 PM IST

సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కాన్సర్ సోకకుండా 15 ఏళ్ల లోపు బాలికలంతా విధిగా హెచ్ పీవీ టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావి వలసలో హెచ్ పీవీ వ్యాక్సినేషన్ , పేదల సేవల కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రజా వేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆడబిడ్డలు సర్వై కల్, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించేందుకు దేశ వ్యాప్తంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్లే ప్రపంచవ్యాప్తంగా 74 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో ఇవి 63 శాతం ఉండగా మన రాష్ట్రంలో 68 శాతంగా ఉన్నాయి. ఏపీలో క్యాన్సర్ కేసులు 2021లో 29,379 నుంచి 2025కి 32,657కు పెరిగాయి. క్యాన్సర్ కేసుల్లో సుమారు 65 శాతం మహిళల్లో నమోదవుతున్నాయి. బ్రెస్ట్, సర్వై కల్ వంటి క్యాన్సర్లు మహిళల్లో అధికంగా ఉంటే, పురుషుల్లో నోటి క్యాన్సర్ ఎక్కువుగా వస్తోంది. సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. ప్రతీ లక్ష మంది మహిళల్లో 15 నుంచి 20 మంది సర్వై కల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ వ్యాక్సిన్ కు రూ.4 వేలు ఖర్చవుతుంది. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 3.45 లక్షల బాలికల వ్యాక్సినేషన్ కోసం రూ.14.11 కోట్లు వ్యయం చేస్తున్నాం. రాష్ట్రంలో 15 ఏళ్ల లోపు వయసున్న బాలికలు 3,45,377 ఉండగా, విజయనగరం జిల్లాలో 11,989 బాలికలున్నారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 1,645 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేసి 16,912 సిబ్బందిని నియమించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

లక్షలో 18 మంది క్యాన్సర్ బారిన

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వైకల్ క్యాన్సర్ కట్టడికి 90–70–90 వ్యూహాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి చెప్పారు. మనదేశంతో పాటు జాంబియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా దేశాల్లో క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో లక్షలో 18 మందికి క్యాన్సర్ సోకుతోంది. క్యాన్సర్ కలుషిత వాతావరణంతో పాటు మన అలవాట్లే దీనికి ప్రధాన కారణం. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 90 శాతం మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలి. ఒకసారి డోస్ తీసుకుంటే రక్షణ పొందవచ్చు. ఈ టీకాలు ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వేస్తారు, యువిన్ యాప్ ద్వారా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం పర్యవేక్షిస్తోంది. టీకా ఇచ్చాక 30 నిమిషాలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. దీని వల్ల ప్రమాదం ఉండదు. 15 ఏళ్ల వయసున్న బాలికలంతా ఈ వ్యాక్సిన్ వేసుకునేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రజారోగ్యానికి రాష్ట్రంలో అధిక ప్రాధాన్యత

రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు విస్తృతంగా జరిపిస్తున్నాం. ఇప్పటివరకు 1.72 కోట్ల మందికి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్, 90.39 లక్షల మంది మహిళలకు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ జరిగింది. నోటి క్యాన్సర్‌కు సంబంధించి 5,07,590 మందిని, బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి 2,50,897 మంది, సర్వైకల్ క్యాన్సర్‌కు సంబంధించి 3,40,154 మందిని రిఫర్ చేశాం. కర్నూలులో రూ. 50 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నాం. గత బడ్జెట్ కంటే 4 శాతం పెంచి ఈ బడ్జెట్ లో వైద్య ఆరోగ్య రంగానికి రూ.19305 కోట్లు కేటాయించాం. రాష్ట్ర బడ్జెట్ లో ఇది 6 శాతంగా ఉండటం ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతకు నిదర్శనం. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.2.5 లక్షల వరకు అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. రూ.25 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించేలా ఈ పాలసీ రూపకల్పన జరిగింది. ప్రజారోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తెస్తున్నాం. త్వరలో వైద్య సలహాల కోసం ఏఐ డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. క్రిమిసంహారక మందులతో పండించిన ఆహారం తీసుకుని క్యాన్సర్ బారిన పడుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ మితాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని తీర్చిదిద్దాలనే ది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

పింఛనుతో పేదల జీవితాల్లో వెలుగులు

20 నెలలుగా ఒకటో తేదీన నేను స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,76,322 మందికి పింఛన్లు ఇస్తుండగా, నెలకు రూ.2,726 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాం. ఏడాదికి ఈ పథకం కోసం రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే నిలిపి వేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక పేదలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో మూడు నెలలదీ కలిపి ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. కనీసం నవ్వడానికి వీలు లేదు. ఇళ్లలో ఎవరూ సురక్షితంగా ఉండలేకపోయారు. రౌడీయిజం పరాకాష్టకు చేరింది. నాపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. అయినా నేను కుంగిపోలేదు. ప్రజల కోసమే పనిచేస్తున్నాను. మిత్రుడు పవన్ కల్యాణ్ రాష్ట్రం కోసం అండగా నిలబడ్డారు. వెంటిలేటర్ పై ఉన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ అందిస్తోంది. ప్రజలు ఎన్డీఏను గెలిపించడంతో ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు.

సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం

ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశాం. ఆడబిడ్డల కోసం కోసం స్త్రీ శక్తి తీసుకొచ్చాం. ఇప్పటి వరకూ 47 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేశారంటే అదీ ఆడబిడ్డల సంక్షేమంపై మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతల్లో రూ.6,310 కోట్లు ఇచ్చాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదు. విద్యపై అసలు దృష్టే పెట్టలేదు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో చిన్న పిల్లల సంఖ్య తగ్గుతోంది. జనాభానే మన దేశ సంపద. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వచ్చాయి. భోగాపురం ఎయిర్ పోర్టులు రాకతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ది జరిగి ఉపాధి పెరుగుతుంది. విజయనగరం జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ త్వరలోనే ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదల ఆకలి తీర్చాం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేందుకే పీ4 విధానం తీసుకొచ్చాం. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయి. మేము అధికారంలోకి వస్తూనే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశాం. గత ప్రభుత్వంలో భూములు రికార్డులు తారుమారు చేశారు. అడిగిన భూములు ఇవ్వకపోతే 22ఏ కింద పెట్టేశారు. డిసెంబర్ లోగా అన్ని భూములు సర్వే చేస్తాం అని ముఖ్యమంత్రి తెలిపారు.

దేవుడికి ద్రోహం చేశారు

గత పాలకులు తిరుమల వేంకటేశ్వర స్వామికే అపచారం తలపెట్టారు. స్వామి ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు. కెమికల్స్ తో లడ్డూ తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టారు. ప్రజలకే కాదు దేవుడికి కూడా ద్రోహం చేయాలని చూశారు. అలాంటి వారు రాజకీయాల్లో ఉంటే సమస్యలు వస్తాయి. దేవుడికి కూడా ద్రోహం చేసే వారికి వదిలిపెట్టకూడదు. నేను ఆ దేవుణ్ణి బజారులోకి లాగాలనుకోలేదు. కానీ జరిగిన తప్పులను ప్రజలకు వివరించాను. చేసిన తప్పును ఇతరులపై నెట్టే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లలో లడ్డూ నాణ్యత ఎలా ఉందో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉందో ప్రజలు గమనించాలి. వైసీపీ వాళ్లు అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించేందుకు రారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. అడ్డదారులు, బెదిరింపులు, దౌర్జాన్యాలతో రాజకీయాలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని గంజాయికి నిలయంగా మార్చేశారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతీ ఎకరాకూ నీరిస్తామని సీఎం వెల్లడించారు.

Next Story