అమరావతి: రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు. తమపై విశ్వాసంతో ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రతిసారీ ఏదో ఒక సవాల్ ఉంటుందని, ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని అన్నారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకుకే ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని, స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చంద్రబాబు అన్నారు.
వనరులు అవే.. అధికారులు వారే.. కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కావాల్సింది కార్యదక్షత అని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. 'సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల పాలనలో 12.94 శాతం వృద్ధి రేటు కనబడింది. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి' అని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం అన్నారు.