తన జీవితం ప్రజల కోసం అంకితమని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తణుకులో పర్యటిస్తున్న సీఎం.. అక్కడ ఏర్పాటు చేసిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' సభలో ప్రసంగించారు. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నానని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశానన్నారు. తన జీవితం అంతా అలుపెరుగని పోరాటమేనని చెప్పారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేయాలనేదే తన సంకల్పం అని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన దానికి రెట్టింపు పనిని రానున్న ఐదు, పదేళ్లలో చేస్తానన్నారు.
వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని విమర్శించారు. తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలు వినేందుకే వచ్చానన్నారు.
గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మనకు మిగిల్చి వెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సుపరిపాలనతో దూసుకెళ్తోందని చెప్పారు. అంతకుముందు 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చెత్త ఊడ్చారు. తణుకులోని ఎన్టీఆర్ పార్క్‌లో చంద్రబాబు చీపురు పట్టి శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వారు పార్కుల్లోని చెత్తా చెదారం ఊడ్చారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి అయ్యారు.