పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
By అంజి Published on 1 March 2025 4:35 PM IST
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. జీడీ నెల్లూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున అందజేస్తామన్నారు. జూన్ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్లన్నీ గుంతలమయం అయితే తాము మరమ్మతులు చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చానని, 2014 - 19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారని, కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైందన్నారు. ఆర్థికంగా లోతైన గోతులు ఉన్నాయన్నారు. నాలుగోసారి సీఎం అయినా తనకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదని చెప్పారు. కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నానని తెలిపారు. వైసీపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో నవ్వే లేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ తొమ్మిది నెలల్లో ఇదే అతి పెద్ద మార్పు అని తెలిపారు.