అమరావతి: సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం (విద్యార్థికి రూ.15 వేలు), అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20 వేలు) పథకాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్టు చంద్రబాబు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో ప్రకటించారు. అన్నదాత సుఖీభవను మూడు విడతల్లో చెల్లిస్తామన్నారు. అన్నదాత సుఖీభవకి కేంద్రం 6 వేల రూపాయలు ఇచ్చినా మిగిలిన 14 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20 వేలు చెల్లిద్దామని చెప్పారు.
2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు వెతుకుతున్నట్టు పేర్కొన్నారు. గోదావరి నీళ్లు రాయలసీమకు తరలించేలా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. అటు వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్దరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామని అన్నారు.
''సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఈ ఏడాది నుంచే, రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే రైతులకు అన్నదాత-సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వేట నిషేధ సమయంలో, ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తాం. చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటుగా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతాం'' అని మంత్రి అచ్చెన్న తెలిపారు.