అమరావతి: దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి అక్కడక్కడా ఫిర్యాదులు రావడంపై సీఎం అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లు ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పేద మహిళలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందించేలా దీపం పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గత ఏడాది దీపావళి పండుగ కానుకగా దీపం - 2 పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబబు ప్రారంభించారు. కోటి యాభై లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతోంది. యాక్టివ్ గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మూడు ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులు. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొనే లబ్ధి దారులు ముందు సొమ్ము చెల్లిస్తే.. ఆ మొత్తం వారి వ్యక్తిగత ఖాతాలకు 24 గంటల నుండి 48 గంటల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.