అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By - Knakam Karthik |
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
అమరావతి: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న కారణంగా జరిగిన నష్టంపై వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని స్థానిక అధికారులు సీఎంకు తెలియజేశారు. కాగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అయితే గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం దేవళం పేట ప్రధాన కూడలిలోని ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగలే నిప్పు పెట్టారు. కొంతవరకు అంబేద్కర్ విగ్రహం కాలిపోయింది. దళిత సంఘాలు భగ్గమన్నాయి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. మరో వైపు అధికార, ప్రతిపక్ష పార్టీలు రగడకు దిగాయి. ఇటు ఎమ్మెల్యే థామస్ అనుచరులు, అటు వైసీపీ నేత కృపా లక్ష్మీ అనుచరులు పోటాపోటీ ఆందోళనలకు దిగారు.
ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవళంపేటకు దళిత సంఘాలు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ధర్నాతో ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళితులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించి దళితుల మనోభావాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో ఈ అకృత్యానికి పాల్పడ్డారని దళితులు ఆరోపించారు. కొంతమంది కుల ద్రోహులు తమ కులాలను అడ్డుపెట్టుకొని. దళితులను దెబ్బతీయాలని ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని ఆవేశం వెళ్లగక్కారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దోషులను వెంటనే అరెస్టు చేయాలని జీడీ నెల్లూరు దళితులు, బడుగు బలహీనవర్గాలు డిమాండ్ చేశాయి.