ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రద్దీ నిర్వహణ, మర్యాదపూర్వక ప్రవర్తన, భద్రత ముఖ్యం అని సూచించారు. మహిళలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు సాయంపైనా సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 5 కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలానే చార్జీపై ప్రభుత్వం ఇస్తోన్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ఆదేశాల్లో తెలిపింది.