భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు, పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలకు ఒకేసారి సాయం అందించాలని సీఎం నిర్ణయించారు. వదరలకు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేలు నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సీఎం సూచించారు.
వరద బాధితులకు సాయంపై శనివారం నాడు ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు వివిధ శాఖల అధికారులు సమీక్ష చేశారు. సాయం అందలేదని ఏ ఒక్కరీ నుండి కూడా ఫిర్యాదు రావొద్దని సీఎం చంద్రబాబు అధికారులను అలర్ట్ చేశారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి అధికారులు.. వరద బాధితులకు పరిహారం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు 10 వేల వాహనాలు వరదల్లో దెబ్బతినగా.. ఇప్పటికే 6 వేల వాహనాలను బీమా చెల్లింపులు జరిగాయి.