Andrapradesh: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

By Knakam Karthik
Published on : 24 July 2025 7:09 AM IST

Andrapradesh, Cm Chandrababu, Institute of Preventive Medicine

Andrapradesh: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్’ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోస్టులు భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబును కోరారు. 723 పోస్టులకు గానూ.. కేవలం 143 మంది మాత్రమే ఉన్నారని మంత్రి చెప్పడంతో ముందుగా 150 పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసే అంశంపై ఉన్న సమస్యను పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ కు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని ముఖ్యమంత్రి చెప్పారు.

మెరుగైన వైద్య సేవలందించడమే కాదు... ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు ప్రజల ఆహారపు అలవాట్లు మొదలుకుని... ఆర్గానిక్ ఉత్పత్తులు వినియోగించడం వరకు కార్యాచరణ అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.వైద్యారోగ్య శాఖ పనితీరు.. టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు చర్చించారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులనేవి ప్రజలకు భరించలేని ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని... ఈ భారం తగ్గేలా చేయాలంటే ఆరోగ్యం మీద ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు.. ఆహారపు అలవాట్లల్లో తీసుకురావాల్సిన మార్పుల పైనా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ప్రస్తుతం ఉన్న ఆహరపు అలవాట్లను కొనసాగిస్తే.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పురుగు మందులు వినియోగించని ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని. ఈ దిశగా రైతులు, ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story