ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా, భూ రికార్డుల తారుమారుని అరికట్టి రైతులకు పూర్తి స్థాయి భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సీఎం ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 60 లక్షల పాస్‌బుక్‌లను డిసెంబర్ 2027 నాటికి పంపిణీ చేస్తామని, ప్రతి గ్రామంలో తప్పులు లేని భూ రికార్డులను సిద్ధం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ఉద్యానవన ఉత్పత్తులను పరిశీలించిన సీఎం, పండ్లకు రక్షణ కవర్లు వేయడం వల్ల కలిగే లాభాలపై రైతుల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, భూగర్భ జలాల పెంపునకు మరియు అధిక లాభాలు ఇచ్చే పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.