ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడి ట్రైన్ టికెట్లు పొందే ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పారు. సినిమా టికెట్లు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల జీపీఎస్ ట్రాకింగ్ కూడా వాట్సాప్‌లోనే చూసుకునే సౌకర్యం కల్పించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లోనే అందుబాటులో ఉంచాలన్నారు. వాట్సాప్‌లో టెక్ట్స్ చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ అందుబాటులోకి తెస్తామన్నారు. విజయవాడ, శ్రీశైలం ఆలయాల్లోనూ వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు ఈవోలు తెలిపారు. ఆలయాలకు సంబంధించిన సేవలను ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీటీడీ సేవలను ఇందులోకి తీసుకురావాలనే విజ్ఞప్తుల అందాయని చెప్పారు.