ఏపీలో పీ-4 ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik
ఏపీలో పీ-4 ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పేదల బాగుకు మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పీ-4 లోగోను ఆవిష్కరించారు. పీ-4 కోసం ప్రత్యేక పోర్టల్ (swarnaandhrap4@ap.gov.in)ను చంద్రబాబు ప్రారంభించారు.
పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములు కానున్నారని చెప్పారు. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యమన్నారు. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ఆశయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని, సున్నా పేదరికం సాధించడమే లక్ష్యంగా 'జీరో పావర్టీ పీ-4... మార్గదర్శి-బంగారు కుటుంబం' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటేనే న్యాయమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ అని సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మానుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు.