కేంద్రజలశక్తి మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం
కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.
By Knakam Karthik
కేంద్రజలశక్తి మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు.
పోలవరం, బసకచర్ల ప్రాజెక్టులతో పాటు జల్ జీవన్ మిషన్‌పై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆయన వివరించారు. అయితే 2024 డిసెంబర్‌తోనే ఈ పథకం ద్వారా నీళ్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ హామీ నెరవేరలేదు. దీంతో ఈ గడువును 2028 వరకూ పొడిగించారు. ఈ మేరకు రూ.70 వేల కోట్లతో పనులకు కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి పవన్ తీసుకెళ్లారు. వేసవీ కాలం వస్తుండటంతో ఈ ప్రాజెక్టును మరింత ముందుకు నడిపేందుకు నిధులు విడుదల చేసి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 95.53 లక్షల ఇళ్లలో 70.44 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీళ్లు అందిస్తోంది. వచ్చే మూడు సంవత్సరాలలో మిగిలిన 20.09 లక్ష ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి పూర్తిగా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను పవన్ కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు.