ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన అన్ని బూట్లను జూన్ 5లోగా ఆయా పాఠశాలలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ (పాఠశాల విద్య) ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున పిల్లలందరికీ స్కూల్ కిట్లు అందేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను కోరారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ నల్ల బూట్లు, రెండు జతల సాక్స్‌లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
గతంలో స్కూల్ బ్యాగ్ తయారీదారులను సందర్శించినట్లుగానే షూ తయారీ కర్మాగారాలను సందర్శించినట్లు ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. బూట్లు 16 సెం.మీ నుండి 30 సెం.మీ వరకు విద్యార్థుల అడుగుల పరిమాణాలకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. షూ పై భాగం 1.8mm +- 0.22 mm మందంతో పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) మెటీరియల్‌తో ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఉత్పత్తుల నాణ్యత, సరఫరాను నిర్ధారించడం కంపెనీ మాత్రమే కాకుండా అధికారుల బాధ్యత కూడా అని ఆయన అన్నారు.