అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఈరోజు న్యూఢిల్లీలో నోటీసులు అందజేసింది. అక్టోబర్ 4న ఆంధ్రప్రదేశ్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని లోకేశ్‌ను సీఐడీ కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ఏ14 నిందితుడిగా ఉన్నారు. దీంతో లోకేశ్‌కు సీఆర్పీసీ 41(A) కింద అధికారులు నోటీసులు అందజేశారు. ఢిల్లీ అశోకా రోడ్డు-50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది.
అంతకుముందు ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. సీఐడీ అధికారులు లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా.. గల్లా జయదేవ్ నివాసం వద్ద టీడీపీకి చెందిన పలువురు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాసేపటికి గల్లా జయదేవ్ సెక్యూరిటీ సిబ్బంది గేట్లు ఓపెన్ చేశారు. అనంతరం లోపలికి వెళ్లిన సీఐడీ అధికారులు.. లోకేష్ కు నోటీసులు అందజేశారు.