టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఐడీ కస్టడీ ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడును రెండురోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. శని, ఆదివారాలలో చంద్రబాబు నాయుడును 12 గంటలకు పైగా, 120 ప్రశ్నలు అడిగింది. కొన్ని డాక్యుమెంట్స్ చూపించి ఈ నిధులు ఎటు వెళ్లాయని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్టుపై పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధినేత అరెస్టు తదనంతర పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న, మద్దతుగా నిలిచిన వివిధ వర్గాలకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం కొనసాగిస్తూనే మరోవైపు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కుట్రను తెలియజేయాలని నిర్ణయించారు.