విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌.. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

CI and SI suspension in Vijayawada incident.విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మాన‌సిక విక‌లాంగురాలిపై సామూహిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2022 12:21 PM IST
విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో సామూహిక అత్యాచార ఘ‌ట‌న‌.. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మాన‌సిక విక‌లాంగురాలిపై సామూహిక అత్యాచార ఘ‌ట‌నపై ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. బాధిత కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్ల‌గా సాయంత్రం రావాలంటూ పోలీసులు తిప్పి పంపించారు. చివ‌రిసారి ఫ‌లానా నెంబ‌ర్ నుంచి ఫోన్ వ‌చ్చిందంటూ ఆధారం ఇచ్చినా స‌రే వెంట‌నే పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టలేదు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. నున్న సీఐ, సెక్టార్ ఎఎస్ఐ పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

ఏం జ‌రిగిందంటే..

నగరంలోని వాంబే కాలనీకి చెందిన శ్రీకాంత్ (26) ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఒప్పంద ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. అదే కాల‌నీకి చెందిన 23 ఏళ్ల మాన‌సిక విక‌లాంగురాలైన ఓ యువ‌తితో శ్రీకాంత్‌కు ప‌రిచ‌యం ఉంది. ఈ నెల 19న ఆ యువ‌తి ఇంటి వ‌ద్ద ఒంట‌రిగా ఉండ‌గా.. శ్రీకాంత్ ఆ యువ‌తిని పెళ్లి చేసుకుంటాన‌ని, ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మించాడు. అనంత‌రం త‌న‌తో పాటు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాడు. ఆస్ప‌త్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగానికి కేటాయించిన ఇరుకు గ‌దిలో ఆమెను రాత్రంతా బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ యువ‌తిని అక్క‌డే వ‌దిలి వేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాలో తెలియ‌క ఆ ప్రాంగ‌ణంలోనే తిరుగుతున్న యువ‌తిపై ఒప్పంద కార్మికుడు చెన్న బాబురావు(23), అత‌ని స్నేహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్(23) లు మ‌రోసారి ఆ ఇరుకుగ‌దిలో బంధించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

మరోవైపు.. కుమార్తె కనిపించకపోవడంతో యువ‌తి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను పిలిచి విచారించ‌గా.. బాధిత యువ‌తిని త‌న‌తో పాటు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లి అక్క‌డే వ‌దిలివేసిన‌ట్లు చెప్పాడు. నిందితుడు చెప్పిన స‌మాచారం ఆధారంగా బాధిత యువ‌తి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు 20వ తేదీ రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుపత్రికి వెళ్లారు.

అక్క‌డ త‌మ కుమారై కోసం గాలిస్తుండ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే యువ‌కుడు యువ‌తిపైన అత్యాచారానికి పాల్ప‌డుతూ క‌నిపించాడు. క‌న్నబిడ్డ‌పై త‌మ క‌ళ్ల ముందే జ‌రుగుతున్న ఆ ఘోరాన్ని చూసి త‌ట్టుకోలేక బాధిత కుటుంబ‌ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. అత‌డిని తీసుకువ‌చ్చి పోలీసుల‌కు అప్పగించారు. పోలీసులు అత‌డిని విచారించ‌గా.. త‌న కంటే ముందు చెన్న బాబురావు కూడా యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డించాడు. దీంతో ఈ అమానుష ఘ‌ట‌న మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కాగా.. పోలీసులు ఆది నుంచి తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని బాధిత కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. త‌మ కుమారై అదృశ్య‌మైంద‌ని ఫిర్యాదు ఇచ్చినా వెంట‌నే ప‌ట్టించుకోలేద‌న్నారు. ఓ వ్య‌క్తిపై అనుమానం వ్య‌క్తం చేసినా.. స‌త్వ‌రం చ‌ర్య‌లు తీసుకోకుండా ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. బాధిత యువ‌తిని ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలోనే వ‌దిలేసి వ‌చ్చేశాన‌ని ఓ నిందితుడు చెప్పినా స‌రే.. ఆమెను ర‌క్షించేందుకు పోలీసులు వెంట‌నే అక్క‌డికి వెళ్ల‌లేదు. తామే(కుటుంబ స‌భ్య‌లే) వెళ్లి ఆమెను సంరక్షించుకున్నామ‌న్నారు. పోలీసులు వెంట‌నే స్పందించి నిందితుడు శ్రీకాంత్‌ను ప‌ట్టుకుని ఉంటే మిగ‌తా ఇద్ద‌రి బారిన బాధిత యువ‌తి ప‌డ‌కుండా బ‌య‌ట‌ప‌డేద‌ని అన్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు, కాలనీవాసులు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదుకు సకాలంలో స్పందించని సీఐ హనీష్‌, సెక్టార్‌ ఎస్సై శ్రీనివాసరావును సస్పెన్షన్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story