పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి.. అధికారులు వేగంగా పని చేయాలి : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు

By Medi Samrat  Published on  2 July 2024 12:45 PM GMT
పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి.. అధికారులు వేగంగా పని చేయాలి : సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సిఎం సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని....వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.....దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్థిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సిఎం అన్నారు.

ఇసుక లభ్యత.. నూతన ఇసుక పాలసీపై సమీక్ష

మొదటి సమీక్షలో భాగంగా రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సిఎం సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు...తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని సిఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు వివరించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆన్ లైన్ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని అధికారులు అన్నారు. ప్రైవేటు ఏజెన్సీలు ఎంత మేర తవ్వకాలు జరిపాయి, ఎంత మేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా నాడు ఎటువంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని తెలిపారు.

అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ...తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును చూడాలని సిఎం ఆదేశించారు. ఇసుక కొరత సమస్యను తీర్చడం, ధరలను నియంత్రించడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీని రూపొందించాలన్నారు. దీని కోసం సమగ్ర సమాచారం, ఆలోచనలతో రావాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక విషయంలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి అవకాశం లేని....ప్రజలకు ఇబ్బందులు కలిగించని పాలసీని తీసుకొస్తాం అన్నారు.

రహదారుల దుస్థితిపై రెండో సమీక్ష

అనంతరం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సిఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని సిఎం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయడం ఒక విధానం అయితే...తక్షణం ప్రజల కష్టాలు తీర్చేందుకు రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు..ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా...ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తామని సిఎం అన్నారు.

నిత్యవసర ధరల భారం తగ్గించాలి

నిత్యవసర సరుకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలపై వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లై శాఖ అధికారులు, మంత్రులతో సమీక్ష చేశారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. డిమాండ్ కు సరిపడా సరఫరా లేక కంది పప్పు ధర అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమోటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని అధికారులు వెల్లడించారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రణాళికతో రావాలని సిఎం సూచించారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు ఆయా సరుకుల దిగుమతుల కోసం అవసరమైన చోట కేంద్రంతో కూడా సంప్రదింపులు జరుపుదామని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 122 రైతు బజార్ లు ఉన్నాయని అధికారులు చెప్పగా.. వాటి నిర్వహణ సరిగా లేక వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదని సిఎం చంద్రబాబు అన్నారు. ఈ మూడు సమీక్షలలో మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, కె.అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story