ఏపీలో ఎన్నికలపై ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  15 March 2024 3:30 PM GMT
ఏపీలో ఎన్నికలపై ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు చేశారు. హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత అని, ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది. నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొనకూడదని.. అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

ఇక లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. షెడ్యూల్‌ను ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. మార్చి 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని.. ఇదే విషయాన్ని ఎక్స్‌ వేదిక ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా రేపు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించనుంది.

Next Story