మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని వైఎస్సార్‌సీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో యూనిట్‌కు ₹4.50 ఉన్న విద్యుత్ కొనుగోలు ఖర్చులను యూనిట్‌కు ₹2.45కి తగ్గించడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అధిక-నాణ్యత గల విద్యుత్‌ను తక్కువ ధరకే ఇచ్చామన్నారు.
స్వార్థ ప్రయోజనంతో పచ్చి అబద్ధాన్ని నిజంలా ప్రచారం చేయడాన్ని ప్రజలెవ్వరూ హర్షించరని, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు ఇక్కడ ఎలా ఉంది అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తక్కువ రేటుతో సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. దాని వల్ల ఏటా రూ.3700 కోట్ల మేర ఖర్చు తగ్గుతుందన్నారు. ఫలితంగా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ఆదా అవుతాయని.. దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
మంచిని మంచి అని అంగీకరించని కూటమి ప్రభుత్వంతో బాలినేని జత కట్టడం చాలా బాధాకరమన్నారు చెవిరెడ్డి. కూటమి పెద్దలకు దగ్గర కావడం కోసం వాసన్న ఈ స్థాయికి దిగజారుతాడని మేం ఏనాడూ కలలో కూడా ఊహించలేదన్నారు. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, తనను కూటమి పెద్దలు గుర్తిస్తారని భావిస్తూ, తనకు తాను కూడా వ్యక్తిత్వంగా దిగజారిపోతున్నాడన్నారు.