డీఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు.. కొత్త తేదీలివే..

రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

By Medi Samrat  Published on  12 March 2024 10:03 AM GMT
డీఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు.. కొత్త తేదీలివే..

రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 6,100 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకై ప్ర‌క‌టించిన‌ డీఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 15 వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని మంత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామని వెల్ల‌డించారు. డీఎస్పీ-2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్య‌ర్ధులు షెడ్యూల్ మార్పును గమనించాలని మంత్రి సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

Next Story