రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలలకు పని వేళల మార్పు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే ఒక గంట సమయం ముందుగానే బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గత నెలాఖరులోనే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 3 తేదీ నుంచి 30 తేదీ వరకు ఉర్దూ విద్యాబోధన పాఠశాలల పని వేళలను మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. రాష్ట్రంలోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, ఉర్దూ మీడియం సమాంతర విభాగం మరియు ఉర్దూ మీడియం డైట్ కళాశాలలకు పనివేళల్ల మార్పు వర్తిస్తుందని తెలిపారు.
రంజాన్ మాసంలో ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి ఒక గంట ముందుగా బయటకు వెళ్లేందుకు అనుమతించే నిర్ణయం, ఉర్దూ పాఠశాలల పని వేళల మార్పు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ముస్లిమ్ సమాజం, తన తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.