నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ ఏపీకి రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 6:19 AM ISTనేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ ఏపీకి రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం ముస్తాబైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు 4వ సారి నేటి ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ తదితరులు రానున్నారు. దీంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. 36 గ్యాలరీల్లో అందరికీ వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు.
వీఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం వివిధ చోట్ల 56 ఎకరాలను కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాటి కోసం ముస్తాబాద రోడ్డులో ఎస్‌ఎల్‌వీ సమీపంలోని పార్కింగ్ ఇచ్చారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారికి ఏర్పాటు చేసిన పార్కింగ్.. వేదికకు 730 మీటర్ల దూరంలో ఉంది. మేధా టవర్స్ వద్ద ప్రముఖుల కోసం మరో పార్కింగ్‌ప్రదేశాన్ని ఉద్దేశించారు. కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండడంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 60మంది పైగా ఐపీఎస్ అధికారులను నియమించారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ..
ఢిల్లీలో జరిగిన మెగా ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత నరేంద్ర మోడీ రికార్డు స్థాయిలో మూడోసారి ప్రధానిగా తిరిగి రావడంతో, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రులను బుధవారం స్వాగతించే సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనుండగా, సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.