2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఆ ఎన్నికలే తనకు చివరివని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్‌షోలో మాట్లాడిన చంద్రబాబు.. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఉంటానని తన హామీని గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు కోరుకున్నట్లే తీర్పు ఇస్తారని, ఆయన కోరిక తప్పకుండా నెరవేరుతుందని అన్నారు.
దేవుడు "తథాస్తు" అంటాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, పేదలకు జీవనోపాధి లభించాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకూడదని వాదిస్తూ ఏపీ మంత్రి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒకవేళ వస్తే రాష్ట్రంలో మళ్లీ కరువు కాటకాలు వస్తాయన్నారు. ఇవే చంద్రబాబు చివరి ఎన్నికలు అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి రాకపోతే ఓ మాట.. అధికారంలోకి వస్తే ఓ మాట మాట్లాడతారన్నారు.
ప్రజలు చంద్రబాబుకు మూడుసార్లు అవకాశం ఇచ్చారని, అవకాశం ఇచ్చిన ప్రతీసారి ఆయన మోసం చేశారని బొత్స విమర్శించారు. అసెంబ్లీలో తన భార్యను కించపరిచేలా మాట్లాడరంటూ సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని అన్నారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసని అన్నారు. ఈ విషయం తెలియడానికి చంద్రబాబుకు చాలా కాలం పట్టిందని ఎద్దేవా చేశారు.