రొట్టెల పండుగను మరింత ఘనంగా చేసుకుందాం : సీఎం

అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు

By Medi Samrat  Published on  19 July 2024 10:24 AM GMT
రొట్టెల పండుగను మరింత ఘనంగా చేసుకుందాం :  సీఎం

అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రొట్టెల పండుగ నిర్వహించే బారాషహీద్ దర్గాలో ప్రార్థనల నిర్మాణాలకు రూ. 5 కోట్లు మంజూరు చేసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పండుగలో పాల్గొనే భక్తులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ విధానం ద్వారా రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు, స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. వందల ఏళ్లుగా ఒక పవిత్రమైన ప్రాంతంగా బారాషహీద్ దర్గా ఉందని అన్నారు. ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తీరుతాయని భక్తులు నమ్ముతారని అన్నారు. ఈ క్షేత్రానికి ఉన్న పవిత్రత, శక్తి కారణంగా ఏడాదికి 10 నుంచి 15 లక్షల మంది రొట్టెల పండుగకు వస్తారని అన్నారు. కేవలం ముస్లిం సోదరులే కాకుండా.. హిందువులు కూడా రొట్టెలు మార్చుకుని తమ కోరికలు నెరవేర్చుకుంటారని అన్నారు. దేవుడిపై నమ్మకంతో ప్రపంచం నడుస్తుందని.. ఆ నమ్మకాలను, ఆచారాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.

రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్ర వేత్తలు కూడా ముందు రోజు వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని తమ ప్రయత్నం విజయవంతం అయ్యేలా చూడాలని కోరుకుంటారని.. అదే నమ్మకం అని పేర్కొన్నారు. ఈ కారణంగానే లక్షల మంది ఎంతో నమ్మకంగా జరుపుకునే రొట్టెల పండుగను 2014లో రాష్ట్ర పండుగగా ప్రకటించామని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దర్గాను, స్వర్ణాల చెరువును అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రార్థనా మందిరం నిర్మాణం నిలిచిపోయిందని మంత్రి నారాయణ సీఎం దృష్టికి తీసుకురాగా.. దాని కోసం రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని రొట్టెల పండుగకు వచ్చిన భక్తులను సీఎం కోరారు. ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని.. దీని నుంచి బయట పడి సంపద సృష్టి జరగాలని సీఎం అన్నారు. సంపద సృష్టి జరిగితే.. మళ్లీ ఆ ఫలాలు పేదలకు సంక్షేమం ద్వారా పంచవచ్చని అన్నారు. ఖజానా నిండేలా దేవుడిని ప్రార్థిస్తూ రొట్టెలు మార్చుకోవాలని నేతలను కోరిన సీఎం.. ప్రభుత్వ ఆదాయం పెరిగితే తిరిగి దాన్ని ప్రజలపైనే ఖర్చుపెడతామని చెప్పారు. రొట్టెల పండుగను రానున్న రోజుల్లో మరింత పెద్ద పండుగగా.. ఘనంగా చేసుకుందామని భక్తులతో అన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలతో మాట్లాడి వారి అనుభవాలు తెలసుకున్నారు. తమ కోరికలు తీరడంతో తాము రొట్టెలు మార్చుకొవడానికి వచ్చామని ఆ మహిళలు చెప్పారు. భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు, మంత్రులకు సీఎం సూచించారు.

Next Story