కోనసీమ జిల్లా పేరు మార్పు అమలాపురంలో హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వార్డ్ అవుతున్నాయని, ఇకపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో కోనసీమ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిజిటల్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఇంటి నుంచి పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇంటర్నెట్ కోసం గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో అమలాపురంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కోనసీమలో వారం రోజులుగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేకపోవడం అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కశ్మీర్‌లో లాగా 'ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం' అనే వార్తలు వినడం బాధాకరమని ఆయన అన్నారు.
ఐటీ ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం కనీసం కనీస అవసరాలు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. సామాన్యుల జీవితంలో ఇంటర్నెట్ కూడా ఒక భాగమని ప్రభుత్వం తెలుసుకోవాలని కోరారు. అలాగే చిరువ్యాపారుల లావాదేవీలు నెట్ ఆధారితంగా సాగుతున్న ఈ రోజుల్లో వారం రోజులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సరికాదన్నారు. కోనసీమలో ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.