షాక్ అయ్యాను : తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఘ‌ట‌న‌పై స్పందించిన చంద్రబాబు

Chandrababu responds to Tirupati RUIA incident. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా

By Medi Samrat  Published on  26 April 2022 10:35 AM GMT
షాక్ అయ్యాను : తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఘ‌ట‌న‌పై స్పందించిన చంద్రబాబు

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా ఓ తండ్రి తన కుమారుడిని ద్విచక్ర వాహనంపై సుమారు 90 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై 90 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దుస్థితికి, మౌలిక వసతుల లేమికి అద్దం పడుతోందని చంద్రబాబు అన్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందడం.. బాలుడి మృతదేహాన్ని తన తండ్రి బైక్‌పై తరలిస్తున్న వీడియోను చూసి షాక్ అయ్యానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

మరోవైపు ఆర్‌డీఓ కనక నరసారెడ్డి వాహనాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అడ్డుకుని రుయా సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఘటనపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నమయ్య జిల్లా చిట్వేల్‌కు చెందిన జాషువా అనే బాలుడు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. బాలుడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించగా, మంగళవారం ఉదయం అతను చనిపోయినట్లు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు ఉచిత అంబులెన్స్‌ను పంపించారు. అయితే, రుయా ఆసుపత్రి వెలుపల అంబులెన్స్ యజమానులు మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడి మృతదేహాన్ని తండ్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి 90 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story