అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై హైకోర్టు మెట్లెక్కారు చంద్రబాబు. సీఐడీ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారించనున్నట్లు తెలిసింది.
రాజధాని అసైడ్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీలపై వేదింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈనెల 23న విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరుకాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ నెల23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీఐడీ సైబర్ విభాగం డీఎస్పీ లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి.