వాలంటీర్లను హెచ్చరించిన చంద్రబాబు నాయుడు
వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
By Medi Samrat Published on 6 Feb 2024 7:15 PM ISTవైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లా వాలంటీర్లు పని చేస్తూ ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లు వైసీపీకి ప్లస్ గా మారుతారని టీడీపీ భావిస్తూ ఉంది. ఇక ఎన్నికలకు కొన్ని నెలలే ఉండడంతో వాలంటీర్ వ్యవస్థపై మరోసారి టీడీపీ విమర్శలు గుప్పిస్తూ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా వాలంటీర్లను హెచ్చరించారు.
ఏపీ సీఎం జగన్‌ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకి పోవాలని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ ఏపీకి పట్టిన శని గ్రహమని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా కదలిరా సభలో చంద్రబాబు విమర్శించారు. జగన్ ను ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని.. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు. జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకి పోతారని.. వైసీపీకి సేవలు చేస్తే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని హెచ్చరించారు. యువత, మహిళలు తోడుంటే గెలుపు తమదేనన్నారు చంద్రబాబు. జగన్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని.. ఓటమి అర్థమైందన్నారు. రాత్రుళ్లు జగన్ కు నిద్ర రావడం లేదు.. అవినీతి డబ్బుతో సిద్ధం పోస్టర్లు పెడుతున్నారని విమర్శించారు చంద్రబాబు.