దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం : సీఎం చంద్ర‌బాబు

నాడు నేను ఒకటే చెప్పా.. టెక్నాల‌జీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారు. అయితే ఇంగ్లీష్‌ను వ‌దిలివెళ్లారని ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు అన్నారు .

By Kalasani Durgapraveen  Published on  22 Oct 2024 5:44 PM IST
దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం : సీఎం చంద్ర‌బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్య‌త్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్స్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రి బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

అనంత‌రం ఆయన మాట్లాడుతూ.. 1995లో నేను ఐటీ విధానం గురించి మాట్లాడితే ఆరోజు ఆ మాట‌లు కొంద‌రికి అర్థం కాలేదని.. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఐటీ రంగాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేసిన‌ట్లు తెలిపారు. బెంగళూరులో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు గ‌తంలో పరిస్థితులు అనుకూలంగా ఉండేవ‌ని.. తాను వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు కృషిచేశానన్నారు. వాటి ఫ‌లిత‌మే నేడు హైద‌రాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని తెలిపారు. పీపీపీ విధానంలో హైటెక్ సిటీని నిర్మించిన‌ట్లు తెలిపారు. ఆ సమయంలో అమెరికాలో 15 రోజులు పాటు పర్యటించి అనేక మంది ఐటీ నిపుణులతో సంప్రదించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరిన‌ట్లు తెలిపారు.

ముఖ్య‌మంత్రి ఇంకా ఏమ‌న్నారంటే..

• నాడు నేను ఒకటే చెప్పా.. టెక్నాల‌జీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారు. అయితే ఇంగ్లీష్‌ను వ‌దిలివెళ్లారని ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

• నేడు ప్రపంచంలోనే ఇంగ్లీష్ మాట్లాడేవారు ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. గణితంలోనూ ఇండియా వారు బలమైనవారు. సున్నాను కనిపెట్టింది కూడా ఇండియా వారే.

• బిల్ గేట్స్ ను కూడా గతంలో హైదరాబాద్ కు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులు వివరించాం. టెలీ కమ్యూనికేష‌న్‌లో డీ రెగ్యులేష‌న్ గురించి నాటి ప్రధాని వాజ్‌పేయ్ ని ఒప్పించాం. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అంటూ వెకిలిగా మాట్లాడారు. ఐటీ రంగంలో భారతీయులు బలమైనవారు. బయో టెక్నాలజీ, ఫార్మాలో భార‌తీయులు స‌మ‌ర్థ‌వంతులు.

• టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. అడ్వాన్స్ డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలు, యాప్‌లు, ఇతర టెక్నాలజీ పరికరాల వినియోగంలో ముందున్నాం. ఐటీ గురించి మాట్లాడిన సంద‌ర్భంలో ఉద్యోగాలు చేయడమే కాదు...ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని చెప్పాను.

• ప్రపంచంలో భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. అందులో తెలుగువారు 30 శాతం మంది ఉన్నారు.

• విమాన సదుపాయం లేని సమయంలో ఢిల్లీ, ముంబైలో దిగి హైదరాబాద్ రావాలని చెప్పాను. వ్యాపారాలు చూసుకుని వెళ్లండని కోరాను.. దానికి కారణం హైదరాబాద్‌కు నాడు సరైన విమాన సదుపాయం లేకపోవ‌డ‌మే.

• నాటి ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి ఓపెన్ స్కై పాలసీ తెచ్చేలా కృషి చేశాం. అప్పుడు మొదటి సారి ఎమిరేట్స్ నుండి హైదరాబాద్ విమానం నడిచింది. ఆ సమయంలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం. 32 సార్లు ప్రధానమంత్రి, విమానయాన శాఖ అధికారులతో చర్చించాం.

• గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం తర్వాత హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్, బయోటెక్నాలజీ పార్క్, ఐటీ, ఫార్మా రంగాల్లో పెద్ద సంస్థల‌ను తీసుకొచ్చాం. ఇప్పుడు దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ నివాస‌యోగ్య సిటీ అని గర్వంగా చెప్తుకుంటున్నాం.

• మన దేశానికి ఒక డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇండియన్ బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 ద్వారా ఇండియాను ప్రపంచంలో నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను.

• నేడు ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ఉపయోగించేది ఇండియన్స్. జన్ ధన్, ఆధార్ మొబైల్ (జామ్‌) అనుసంధానం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

• రాబోయే కాలం అంతా డేటాదే. ఎంత డేటా ఉంటే దేశానికి, పెట్టుబడిదారులకు అంత బాగుంటుంది. ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్‌) ద్వారా నిర్ధిష్టమైన సమాచారాన్ని పొందవచ్చు. డ్రోన్స్ ను మనం ఎక్కడికైనా పంపవచ్చు...సరైన సమాచారాన్ని పొందవచ్చు.

• ఇటీవల విజయవాడలో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. ఆ సమయంలో బాధితులకు ఆహారం క‌లుషితం కాకుండా, వృధా కాకుండా అందించడానికి దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లు వినియోగించి బాధితులకు ఆహారం అందించాం. హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన సంద‌ర్భంలో పైనుంచి వేయడంతో ఆహార పొట్లాలు పగిలిపోయేవి. కానీ.. డ్రోన్ల ద్వారా సురక్షితంగా 1.50 లక్షల మందికి ఆహారం అందించాం.

• అంతేకాదు డ్రోన్లు సిటీలోకి పంపి ఎంత చెత్త ఎక్కడ పేరుకుపోయిందో కూడా సర్వే చేశాం. సరైన సమయంలో అన్నింటిని గుర్తించి 20 మెట్రిక్ టన్నుల చెత్తను నాలుగు రోజుల్లోనే తొలగించాం. రోడ్లు ఎక్కడ సరిగా లేకపోయినా డ్రోన్లు పంపి సమాచారం తెప్పించాం. ఏ రోడ్డు పక్కన చెత్త ఉన్నా పరిశీలించి శుభ్రం చేయించాం. వరద నీరు బయటకు పోవడానికి కారణం డ్రెయిన్లు మూసుకుపోవ‌డ‌మ‌ని.. బ్లాక్‌ల‌ను గుర్తించి, వాటిని తొల‌గించి నీటిని బయటకు పంపాం.

• భవిష్యత్తులో డ్రోన్లు గేమ్ ఛేంజ‌ర్లుగా చెప్పొచ్చు. వ్యవసాయం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ త‌దిత‌రాల్లో వాటిని వినియోగించవచ్చు.

• విజిబుల్ పోలీసింగ్...ఇన్ విజిబిల్ పోలీస్ కు ప్రాధాన్య‌మిస్తున్నాం. టెక్నాల‌జీ స‌హాయంతో నేర‌గాళ్ల ఆట‌క‌ట్టిస్తాం. ప్రతి అంశంలోనూ ఖచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వ‌ర‌కు అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాలు అందించ‌డంలో టెక్నాల‌జీని వినియోగించుకుంటాం.

• భూసార పరీక్షలు, పురుగుమందుల పిచికారీ, భూ సర్వే, భూసార ప‌రీక్ష‌లు త‌దిత‌రాల‌ను డ్రోన్ల ద్వారా నిర్వహించవచ్చు. కనీసం 100 నుండి 150 వరకు డ్రోన్ అప్లికేష‌న్స్ (డ్రోన్ యూజ్ కేస్‌లు) వినియోగం ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాం. అప్లికేష‌న్స్‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రీక్షించి ఆయా కంపెనీల‌కు స‌రైన విధంగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా పైలట్ ప్రాజెక్టుల‌కు వీలుక‌ల్పిస్తాం.

• నాకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. ఇండియా కు రెండంకెల వృద్ధిరేటు సాధించే స‌త్తా ఉంది. నాలెడ్జ్ ఎకానమీలో గ్లోబల్ సర్వీస్‌లు అందించ‌గ‌ల సత్తా కూడా మన దేశానికి ఉంది.

• పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల నుండి సలహాలు, సూచలను తీసుకుని డ్రోన్ పాలసీని ప్రవేశపెడతాం. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని ఆవిష్క‌రిస్తాం. కనీసం 35 వేలకు పైగా డ్రోన్ ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దుతాం.

• ఏఐ, ఎమ్ఎల్.. ప్రతి ఒక్కరి జీవితాల‌ను ప్రభావితం చేస్తాయి. మీ అందరికీ ఒక సూచన ఇస్తున్నా...థింక్ గ్లోబ‌ల్లీ.. యాక్ట్ గ్లోబ‌ల్లీ విధానాన్ని అనుస‌రించాలి.

• ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. అక్కడ డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతికి దగ్గరగా ఉంటుంది. అక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

• నేను డ్రోన్లు తయారీదారులకు కూడా చెప్తున్నా....మీకు నేను అంబాసిడర్ గా ఉంటాను....మీ మార్కెట్ ను ప్రమోట్ చేస్తా. నేను చాలా మంది ప్రధానులను చూశాను కానీ టెక్నాలజీని ఇంతగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధాని మోదీ. స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో విధానాల రూప‌క‌ల్ప‌న‌కు సిద్ధంగా ఉన్నాం.

• స్టూడెంట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ కు కూడా చెప్తున్నా నాలెడ్జ్ ఎకానమీకి ఇది మంచి సమయం. ప్రతిదీ అదుబాటులో ఉంది. ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తే ఇండియన్స్ ను ఎవరూ ఎదుర్కోలేరు. నేడు మ‌న దేశం యువ జ‌నాభా త‌ద్వారా యంగ్ టాలెంట్‌తో తొణికిస‌లాడుతోంది.

• కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో భాగ‌స్వాముల‌వుతున్నారు. స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో రాష్ట్రాన్ని డ్రోన్ హ‌బ్‌గా మారుస్తాం.

• రాష్ట్రంలోని యూనివర్సిటీలు కూడా థియ‌రిటిక‌ల్ విద్యకే కాకుండా అప్లికేష‌న్స్‌కు ప్రాధాన్య‌మివ్వాలి. న‌వ టెక్ ఆవిష్క‌ర‌ణ‌లు దిశ‌గా యువ‌త‌ను ప్రోత్స‌హించాలి. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నాం.అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది.. మిగతావి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం. 2047 నాటికి ఒక కుటుంబం...ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది నా అభిమతం.

• 25 ఏళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాని.. అదే విధంగా ఇప్పుడు చెప్తున్నా ఒక కుటుంబంలో ఒక వ్యాపారవేత్త, ఒక స్టార్టప్ కంపెనీ ఉండాలని చెప్తున్నా. ఇది సక్సెస్ అయితే భార‌త్‌.. టెక్నాల‌జీ, గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌లో ముందుంటుందన్నారు.


Next Story