'కలిసి మాట్లాడుకుందాం'.. రేవంత్‌కు చంద్రబాబు లేఖ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి సమావేశం కావాలని ప్రతిపాదించారు.
By అంజి Published on 2 July 2024 11:15 AM IST
'కలిసి మాట్లాడుకుందాం'.. రేవంత్‌కు చంద్రబాబు లేఖ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి సమావేశం కావాలని ప్రతిపాదించారు. ఒకవేళ సమావేశమైతే.. చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎలో భాగమైన టిడిపి అధినేత చంద్రబాబు జూలై 6న హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావాలని ప్రతిపాదించారు.
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సును నిర్ధారించడానికి తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులు "సమీప సహకారాన్ని పెంపొందించుకోవడం" ముఖ్యమని చంద్రబాబు నాయుడు అన్నారు. "పూర్వ ఆంధ్రప్రదేశ్‌ను విభజించి 10 సంవత్సరాలు అయ్యింది. పునర్వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమయ్యే సమస్యలకు సంబంధించి అనేక చర్చలు జరిగాయి, ఇది మన రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంది" అని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.
పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను సాధించే దిశగా సమగ్రంగా నిమగ్నమయ్యేందుకు ముఖాముఖి సమావేశం అవకాశం కల్పిస్తుందని టీడీపీ అధిష్టానం పేర్కొంది. నిజానికి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి మారకముందు టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు నమ్మినబంటుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలని నిర్దేశించిన గడువు ముగిసిన తరుణంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదన చేశారు.
హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే రాజధాని అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా రాజధాని లేదు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని టీడీపీ చెబుతోంది. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీడీపీ ప్రతిపాదనను తుంగలో తొక్కి మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటాయి. అయితే, అది టేకాఫ్ చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైంది.