రామోజీరావు కన్నుమూత.. చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

రామోజీరావు మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు.

By Medi Samrat  Published on  8 Jun 2024 12:39 PM IST
రామోజీరావు కన్నుమూత.. చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి

రామోజీరావు మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని.. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో ఆయ‌న‌ సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారన్నారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు తెలిపారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందన్నారు. స‌మస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Next Story