ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేస్తున్న వైఎస్ షర్మిల సొంత అన్న అయిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే షర్మిల వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు స్పందించడం చాలా తక్కువ. తాజాగా చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పని అని అన్నారు. జగన్ పరిస్థితి నచ్చక సొంత పార్టీ వారే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని.. ఐదు కోట్ల ప్రజానీకం క్షేమం కోసం అందరూ ఆలోచించాలని కోరారు. ఇక చెల్లెలు షర్మిలకు అన్యాయం చేశాడని.. పాపం, ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడామె కూడా ఒక పార్టీలో చేరింది. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలైంది. అందుకే నేనేమీ మాట్లాడను. వాళ్ల అన్నపై ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మేమేమీ బాధపడడంలేదని.. సమాధానం చెప్పుకునే సమర్థత తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. ఆ విషయం షర్మిల కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు సొంత చెల్లెలితో పాదయాత్ర చేయించి, ఊరూరా తిప్పి ఎలా ఉపయోగించుకున్నాడో అందరూ చూశారు. బాత్రూంలో టిష్యూ పేపర్ ను విసిరేసినట్టు చెల్లెల్ని వదిలేశాడన్నారు చంద్రబాబు.