రాష్ట్ర వ్యాప్తంగా తిరగని బస్సులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 9 Sep 2023 5:20 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. నంద్యాలలో సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. టీడీపీ అగ్రనాయకత్వం నుంచి ఏ క్షణమైనా.. ఏదైనా జరగొచ్చనే సంకేతాలు వెళ్లాయి.టీడీపీ శ్రేణులు ఆర్.కె ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చాయి. పోలీసులు, తెలుగుదేశం నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ముందుకు వెళ్లారు. చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి, ఎన్‌ఎస్‌జీ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. అరెస్టుకు సంబంధించి ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌కి పోలీసులు సమాచారం ఇచ్చారు.
చంద్రబాబును విజయవాడకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఆయనను గిద్దలూరు, మార్కాపురం మీదుగా తరలిస్తున్నారు. ఆయన కాన్వాయ్ శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గిద్దలూరు దాటినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రాస్తారోకోలు చేస్తూ ఉండడంతో వాహనాలు తిరగడం లేదు. చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.