నెల్లూరు జిల్లాకందుకూరులో తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల పిల్లలను చదివించే బాధ్యత టీడీపీదేనని స్పష్టం చేశారు. లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పార్టీ, టీడీపీ నేతల తరఫున రూ.24 లక్షలు ఇస్తామన్నారు. ఇరుకు రోడ్లలో సభ నిర్వహించడంపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు స్పందిస్తూ.. తాము ఇరుకు రోడ్లలో నిర్వహించలేదని, ఇతర రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన చోటే సభను ఏర్పాటు చేశామన్నారు. అధికార పార్టీ చేసిన ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. తనను విమర్శించిన వారి విజ్ఞతకే ఆరోపణలు వదిలేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
కాగా నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిది మంది మరణించారు. పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబు ఇదేం ఖర్మ సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సభాస్థలి వద్ద కార్యకర్తల తోపులాటలో కొందరు అదుపుతప్పి డ్రైనేజీలో జారిపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.