ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
ఏపీలో నెలకొన్ని పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 8:40 AM GMTఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
ఏపీలో నెలకొన్ని పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జగన్ సీఎం అయ్యినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, న్యాయవ్యవస్థ, కేంద్ర సంస్థలపసై దాడులు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. 9 పేజీలతో లేఖ రాసిన చంద్రబాబు ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని, తన విశేషాధికారాలతో పరిస్థితిని చక్కదిద్దాలని రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు చంద్రబాబు. జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఏపీలో హింస, అరాచకం, మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ జగన్ సర్కారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజా వేదికను కూల్చేశారని ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని నాశనం చేశారని ఆరోపించారు చంద్రబాబు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని చెప్పారు. మూడు రాజధానులంటూ సీఎం జగన్ తన పంతం కోసం మండలిని రద్దు చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను వివిధ మార్గాలతో తప్పించుకుంటున్నాడని చంద్రబాబు అన్నారు. ఓటర్ల నమోదులో నిమగ్నమైన ఉద్యోగులను కూడా సీఎం జగన్ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనుల కోసం వాలంటీర్లను సైతం వాడుతున్నారంటూ చంద్రబాబు తెలిపారు. అందుకోసమే రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి డేటాను వాలంటీర్ల చేత సేకరించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ డేటా అంతా వారికి ఉపయోగపడేలా ప్లాన్ చేసుకున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇక తిరుమల శ్రీవారి విషయంలోనూ జగన్ ప్రభుత్వం వింత పోకడకు దారి తీసిందని అన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా హిందూయేతర వ్యక్తిని జగన్ పలుమార్లు నియమించినట్లు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. దేవాలయాలపై దాడులు చేశారని చెప్పారు. జగన్ పాలనలో ప్రజల జీవితాలు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను కూడా హత్యలు చేసే స్థాయికి దిగజారారని చంద్రబాబు తెలిపారు. అందుకే రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ జోక్యం చేసుకోవాలని తాను రాసిన లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.