పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత
Chandrababu Key Comments On Alliances. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 Sept 2022 5:31 PM IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలతో టీడీపీ పొత్తుల గురించి తాను ఇప్పటిదాకా మాట్లాడలేదని.. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పొత్తుల గురించి తాను ఇప్పటివరకు మాట్లాడలేదని చెప్పడమే కాకుండా ఈ విషయంపై పార్టీ నేతలకు స్పష్టత ఉండాలని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం పనిచేయాలన్న చంద్రబాబు.. ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు. ఎన్నికలు త్వరగా వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందని.. నెత్తిన ఉన్న కుంపటిని ఎప్పుడెప్పుడు దింపుకుందామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం పోరాడే నేతలు మరింత మంది తయారు కావాల్సి ఉందని, పార్టీలోని సీనియర్లు అలాంటి నేతలను తయారు చేసే బాధ్యతలను తీసుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికి సంపద సృష్టించకుంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన విధ్వంసంతో సాగుతుందని విమర్శించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ధరలు ఉన్నాయని ఆరోపించారు. పన్నులు, ధరల పెంపుదల వల్ల రాష్ట్రంలో పేదలు బతకలేని పరిస్థితి తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు, ఐటీ విప్లవం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు గౌరవంగా బతుకుతున్నారంటే అందుకు టీడీపీయే కారణమని గుర్తు చేశారు.