చంద్రబాబూ.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి: వైఎస్‌ షర్మిల

సీఎం చంద్రబాబు మోదీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన (మోదీ) ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు.

By అంజి
Published on : 8 Jan 2025 12:34 PM IST

Chandrababu, special status, Prime Minister, YS Sharmila

చంద్రబాబూ.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి: వైఎస్‌ షర్మిల

అమరావతి: సీఎం చంద్రబాబు మోదీ కోసం ఎదురుచూస్తుంటే.. ఆయన (మోదీ) ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. ''తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారు'' అంటూ షర్మిల ఫైర్‌ అయ్యారు.

''వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదు. కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదు'' అంటూ వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ విశాఖకు వస్తున్న ప్రధాని మోదీతో.. ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షర్మిల డిమాండ్‌ చేశారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలి, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించాలని షర్మిల అన్నారు.

Next Story