ప్రజలకు తప్ప.. నేను ఎవరికీ భయపడా: చంద్రబాబు
Chandrababu flays AP govt in Adoni, says it ignored development. కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆదోనిలో
By అంజి
కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆదోనిలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆదోని పట్టణంలో చంద్రబాబు రోడ్‌షోకు.. జనం పోటెత్తడంతో ఆదోని వీధులన్నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జనసంద్రమైంది. ఈ రోడ్ షోకు విశేష స్పందన రావడంతో స్థానిక పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఆదోని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి పెరిగిపోయిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇసుక, మద్యం, భూకబ్జాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ సర్కార్ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. వైసీపీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని బాబు తేల్చి చెప్పారు. చెత్తతో సహా ప్రతిదానిపై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోందని నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితే లేదని, కల్తీ మద్యం విక్రయిస్తూ పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక, మద్యం రాకెట్లు పెరిగిపోయాయని అన్నారు. తనను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు తప్ప తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు అన్నారు. పేదలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరగాళ్ల రాష్ట్రంగా మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.