Chandrababu Arrest: సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు

టీడీపీ అధినేత చంద్రబాబుని శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సీఐడీ రిమాండ్ రిపోర్టు తయారు చేసింది.

By Srikanth Gundamalla  Published on  10 Sept 2023 7:40 AM IST
Chandrababu, Arrest, ACB Court, CID, Andhra pradesh,

Chandrababu Arrest: సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుని శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సీఐడీ రిమాండ్ రిపోర్టు తయారు చేసింది. ఈ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు చేసింది సీఐడీ. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబుకి పూర్తి అవగాహన ఉందని చెబుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదల అయ్యాయనీ తెలిపారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుని ఈ ఉదయమే అధికారులు హాజరు పర్చారు. తాజాగా వాదనలు జరుగుతున్నాయి. ఇక నారా లోకేశ్‌ కూడా ఏసీబీ కోర్టులోనే ఉన్నారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరఫున అడిషనల్ అడ్వొకేట్‌ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

రోడ్డుపైనే పడుకుని పవన్ కళ్యాణ్ నిరసన

నిన్నటి నుంచి ఏపీలో ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. చంద్రబాబుని అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ కూడా చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆయన్ని విజయవాడ వెళ్లకుండా మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా పవన్‌ కళ్యాణ్‌ రోడ్డుపైనే పడకుకుని నిరసన తెలిపారు. దాంతో.. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహారంపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెయిల్‌పై బయట ఉన్న సీఎం జగన్ జైలు గురించే ఆలోచిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని పరామర్శించేందుకు వెళ్తుంటే అడుగడుగునా అడ్డుకోవడంపై ఆయన తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. క్రిమినల్ చేతిలో అధికారం దురదృష్టకరంని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే.. వపన్ రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంతో శాంతి భద్రతకు విఘాతం కలగొచ్చని పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పవన్తో పాటు నాదెండ్ల మనోహర్‌ను కారులో ఎక్కించుకుని.. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద విడిచిపెట్టారు.

శనివారం సాయంత్రం 5:10 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటలకు విచారణ కొనసాగింది. ఏకంగా 10 గంటల పాటు చంద్రబాబుని విచారించారు. మరోవైపు చంద్రబాబుకి తెల్లవారుజామున అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 3:40 గంటలకు విజయవాడలోని సీజీహెచ్‌లో చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్లకుండా మరోసారి సిట్‌ కార్యాలయానికే తీసుకెళ్లారు. ఆ తర్వాత 5:50 గంటలకు సిట్‌ ఆఫీస్‌ నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు అధికారులు. చంద్రబాబు అనారోగ్యం దృష్ట్యా ఆయన్ని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది. దాంతో.. అధికారులు చంద్రబాబుని ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోర్టు ఆవరణలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కోర్టు ఆవరణలో భారీగా టీడీపీ శ్రేణులు మోహరించారు.

Next Story