ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. చర్చీలన్నీ విద్యుత్ కాంతులు, శాంతాక్లాజ్‌ల సందడితో కళకళలాడుతున్నాయి.
By అంజి Published on 25 Dec 2024 8:00 AM ISTప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. చర్చీలన్నీ విద్యుత్ కాంతులు, శాంతాక్లాజ్‌ల సందడితో కళకళలాడుతున్నాయి. పండుగను ప్రార్థనలు, బైబిల్ పఠనాలతో జరుపుకుంటున్నారు క్రైస్తవులు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి నుంచే పండుగ వాతావరణం నెలకొంది. యేసు పుట్టిన రోజు సందర్భంగా అన్ని చర్చిలను అందంగా అలంకరించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
''సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం'' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
క్రిస్‌మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గారు అన్నారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్రమంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.