రాబోయే 12 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 48 గంటల్లో దక్షిణమధ్య బంగాళాఖాతం,పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు.
నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి - మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.
అటు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.